Saturday 26 March 2011

ఆత్మరక్షణ అవసరం కాదు అనివార్యత


సమాజంలో అందరికంటే ఎక్కువగా టార్గెట్ అయ్యే సెక్టార్లో మీడియా ఒకటి. అధికారుల అవినీతి ఎండగట్టినా.. నేతల అక్రమాలను బయటపెట్టినా.. రౌడీలు, గూండాల అరాచకాలను వెలుగులోకి తీసుకొచ్చినా.. మీడియా ప్రతినిధులు టార్గెట్ అవుతూనే ఉంటారు. ఇవి చాలవన్నట్టు ఏవైనా పెద్ద పెద్ద సంఘటనల కవరేజిలోనూ తన్నులుతింటూనే ఉన్నారు. 


ఈ పరిస్థితుల్లో పాత్రికేయులకు ఆత్మరక్షణ తక్షణావసరంగా మారింది. ఇంకా చెప్పాలంటే ఆత్మరక్షణ తప్పనిసరిగా మారిందని చెప్పుకోవచ్చు. ఆత్మరక్షణ కోసం ఎన్నోరకాల విద్యలున్నా.. అన్నింట్లోనూ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. అందుకే క్రైం రిపోర్టర్స్ అసోసియేషన్ మీడియా ప్రతినిధుల కోసం కరాటే క్లాసులు నిర్వహిస్తోంది. ప్రతి ఆదివారం ఉదయం 6గంటల నుంచి 8 గంటల వరకు ఈ క్లాసులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందే పోలీసులకు కరాటే క్లాసులు చెప్పే మాస్టర్ నేతృత్వంలో జరుగుతున్న ఈ క్లాసులకు మీడియాలో పనిచేసే ఎవరైనా హాజరుకావొచ్చు.


కరాటే క్లాసుల ప్రస్తావన తీసుకురాగానే "రిపోర్టర్లకు కరాటే ఎందుకన్నా? మనమేమైనా రౌడీలమా?" అనే నిష్టూరాలు 
కూడా వినిపించాయి. ఆత్మరక్షణ కేవలం రౌడీలకేనా? మనకు అవసరం లేదా? మరి బౌద్ధ సన్యాసులేమైనా రౌడీలా.. వారికి ఈ యుద్ధ విద్యలెందుకు? దైవచింతనలో మునిగితేలాల్సిన బౌద్ధ సన్యాసులే ఈ యుద్ధ విద్యలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారన్న విషయాన్ని మరువరాదు. సన్యాసులకే అవసరమైన ఈ విద్య.. నిత్యం ప్రమాదకర వ్యక్తులు, పరిస్థితుల మధ్య సంచరించే మీడియా ప్రతినిధులకు అవసరం లేదా? అందుకే ఇలాంటి నిష్టూరాలు మాని ఇష్టముంటే వచ్చి నేర్చుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.